ధాన్యం రవాణాలో అడ్డగోలు నిర్ణయాలు ! 2 m ago
8కే న్యూస్, అమరావతి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అన్నదాతలకు అండగా ఉంటుందని, రైతుల వద్ద చివరి ధాన్యం గింజవరకూ మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ విధానాలు బాగానే ఉన్నా అమలులో అధికారుల చర్యల మూలంగా రైతులకు లబ్ది చేకూరకపోగా రవాణా రూపంలో నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనమే పౌర సరఫరాల సంస్థ తాజాగా పిలిచిన రవాణా టెండర్ల విధానం ఊరంతా ఒకదారైతే....ఉలిపి కట్టెది మరో దారి అన్న చందాన దేశంలోని మిగిలిన రష్ట్రాలు ధాన్యం రవణాకు అనుసరిస్తున్న విధానాలు ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల సంస్థ అనుసరిస్తున్న విధానం మరోలా ఉంది. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన పంజాబ్, ఛంఢీఘఢ్ రాష్ట్రాల్లో 4 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్య రవాణా చేస్తుండగా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి మిల్లర్లకు రవాణా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో రెవెన్యూ డివిజన్లవారీగా ధాన్యం రవాణా టెండర్లు పిలవగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నూతనంగా జోన్లవారీగా పిలవడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా జోన్ల విభజనలో జిల్లాలు పొంతన లేకుండా ఉన్నాయి. సాధారణంగా జోన్లలో ఆయా సమీపంలోని జిల్లాలను పొందుపర్చడం జరుగుతుంది. అయితే, పౌర సరఫరాల సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల జోన్లలో రాయలసీమ జిల్లాలు చేర్చడం ఇందుకు నిదర్శనం. అన్ని జోన్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 1 నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ధాన్యం రవాణాకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ ఈనెల 17న టెండర్లు పిలవడం జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి జోన్లవారీగా టెండర్లు పిలిచారు. ఒక్కో జోన్కు సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణాకు సుమారు రూ.6.5 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఇవ్వాలని పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉన్నా రవాణా చేసే లారీల సంఖ్యలోనే పొంతన కనిపించడం లేదు.
జోన్-1లో టెండర్లు ఇలా
మొదటి జోన్లోని 8 జిల్లాలకు ధాన్యం రవాణాకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. ఇందులో ప్రధాన ధాన్య భాండారంగా పిలిచే పశ్చిమ గోదావరి, విజయనగరం, మణ్యం జిల్లాలు ఉన్నాయి. వీటితోపాటు రాయలసీమలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం, పశ్చిమ గోదావరి, మణ్యం జిల్లాలు తప్ప మిగిలిన ఐదు జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి నామమాత్రంగా ఉంటుంది. ఈజోన్లో 15.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేయాల్సి ఉంది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం రవాణాకు కేవలం సొంత లారీలు 24, అద్దె లారీలు 63 మొత్తం కలిపి 87 మాత్రమే కావాలని టెండర్లు పిలవడం గమనార్హం. ఈ మూడు జిల్లాల్లోనే సుమారు 750కుపైగా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. సీజన్లో ఒక్కో రైతు సేవా కేంద్రం నుండి రోజుకు కనీసం 2 లారీల ధాన్యం రవాణా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే 1,500 లారీల అవసరం ఉంటుంది. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి సుమారు ఐదు నెలల పాటు ధాన్యం రవాణా ఉంటుంది. సగటున రోజుకు 10 నుండి 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 25 టన్నుల కెపాసిటీ కల 12 చక్రాల లారీలు సుమారు 400 వరకూ అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కో లారీ ఎగుమతి, దిగుమతికి ఒక రోజు సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే రైస్ మిల్లర్ల అనుమతి లేనిదే ధాన్యం రవాణా చేయడం కుదరని పరిస్థితి ఉంది.
జోన్-2లో టెండర్లు ఇలా
ఇదిలా ఉండగా జోన్ 2లో ప్రధానంగా ధాన్యం పండించే కృష్ణా, కాకినాడ, ఏలూరు జిల్లాలతోపాటు నెల్లూరు, నంధ్యాల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్లో సుమారు 15.68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేయాల్సి ఉంది. ఐతే కేవలం 18 సొంత లారీలు, 69 అద్దె లారీలు కలిపి కేవలం 87 లారీలు మాత్రమే అవసరం ఉంటుందని టెండర్లలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జోన్ 3 లోని 10 జిల్లాల్లో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కోనసీమ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈజోన్లో విశాఖపట్టణం, అనకాపల్లి, పల్నాడు, గుంటూరు, సత్యసాయి జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ ఐదు జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి ఒక మోస్తరుగా ఉంటుంది. ఈజోన్లో 16.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణాకు ప్రధాన జిల్లాలకు కేవలం 25 సొంత లారీలు, 62 అద్దె లారీలు ఉండాలని పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేయాల్సి ఉండగా కేవలం సొంత లారీలు రెండు, అద్దె లారీలు నాలుగు మాత్రమే ఉంటే సరిపోతుందని టెండర్లలో పేర్కొనడం గమనార్హం. వరి తక్కువగా పండించే మిగిలిన అన్ని జిల్లాల్లో కేవలం ఒక సొంత లారీ, రెండు అద్దె లారీలు మాత్రమే అవసరమని పౌరసరఫరాల సంస్థ టెండర్లలో పేర్కొనడం జరిగింది.
గతంలో డివిజన్ల వారీగా ఉండేవి
గతంలో రెవెన్యూ డివిజన్ల వారీగా ధాన్యం రవాణా టెండర్లు పిలిచినప్పుడు సొంతవి 20, అద్దెవి 20 లారీలు ఉండాలని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చూస్తే జిల్లాకు సుమారు 120 లారీల వరకూ ఉండే అవకాశం ఉంది. అయితే, పాత విధానంలోనే ధాన్యం రవాణాకు సరిపడా లారీలు దొరకక ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈనేపథ్యంలో నియోజకవర్గాలు, మండలాల వారీగా ధాన్యం రవాణా టెండర్లు పిలిస్తే అటు రైతులకు, ఇటు అధికారులకు వెసులుబాటు ఉండేదని భావించారు. అయితే, ప్రస్తుత విధానం వలన పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా జిల్లా అధికారులపై మరింత భారం పడుతుందని చెబుతున్నారు.
మిల్లర్లకు అనుకూలంగా
ప్రస్తుత విధానం రైస్ మిల్లర్లకు అనుకూలంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ధాన్యం ఉత్పత్తికి సరిపడా లారీలు లేకపోతే రైతులే నేరుగా మిల్లులకు రవాణా చేయాల్సిన పరిస్తితులు నెలకొంటాయి. ఈ తరుణంలో రవాణా కాంట్రాక్టర్ పేరతో మిల్లర్లే ట్రాన్స్పోర్టు ఛార్జీలు, బిల్లులు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా వర్షాలు, తుఫాన్లు వచ్చిన సమయంలో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు లారీలు ఎ క్కువ అవసరం ఉంటుంది. ఆసమయంలో రవాణాకు లారీలు లేకపోతే రైతులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా
ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలు మరియు రవాణా విషయంలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూదని కేంద్రం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వం మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్లకు సూచించినా సరిపడా రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతులు సొంతంగా మిల్లులకు చేర్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో వారి కష్టాన్ని, శ్రమను దోచుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానలవలన రైతులకు ధాన్యం విషయంలో మద్దతు ధర లభించలేదు. ఆన్లైన్ రవాణా విధానంలో కూడా రైతులు ఇబ్బందులకు గురి కవాల్సి వచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రైతు పక్షపాతిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో మరింత దూర దృష్టితో వ్యవహరించాలని అన్నదాలు కోరకుంటున్నారు.